అన్వేషణ సినిమా గురించి దర్శకుడు వంశీ పంచుకున్న జ్ఞాపకాలు

అన్వేషణ సినిమా గురించి వంశీ పంచుకున్న జ్ఞాపకాలు

అన్వేషణ సితార మహర్షి లాంటి మంచి చిత్రాలను తీసిన  దర్శకుడు వంశీ. ఆయనలో ఒక అద్భుతమైన రచయిత మరొక అద్భుతమైన డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు. ఇతను ఎంత అద్భుతంగా రాయగలరు అంతే అద్భుతంగా సినిమాలు కూడా తీయగలడు. ది పల్లకిని సినిమాతో అతి పిన్న వయసులోనే దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన వంశి తర్వాత తను తీసిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు

ఇప్పటికీ వంశీ ఏదైనా కొత్త సినిమా తీస్తున్నాడు అంటే కచ్చితంగా ఆయనకంటూ సపరేట్ గా ఉన్న అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. బాపు ఎంతో అందంగా చిత్రాలు గీస్తే వంశి అంతే అందంగా అద్భుతమైన కథ రాయడంలో  అంతే దిట్ట. నిజానికి అంతర్ముఖుడై వంశీ ఎవరితోనూ పెద్దగా మాట్లాడారు కలవరు కానీ సోషల్  మీడియా పుణ్యమా అని ఫేస్ బుక్ లో తన అనుభవాలను జ్ఞాపకాలను పంచు కుంటూ ఉంటారు. చంద్ర బండ అలనాటి క్లాసిక్ అన్వేషణ సినిమా గురించి వంశీ ఫేస్ బుక్ పోస్ట్ లో పంచుకున్న ఆయన జ్ఞాపకాలను యధాతధంగా  మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.
మద్రాస్ సెంట్రల్ స్టేషన్ ఐదో నెంబర్ ప్లాట్ ఫారం మీదున్న మధురై వెళ్లే రైలు, మేమెక్కిన కాసేపటికి నెమ్మదిగా కదిలి స్పీడందుకుంది.
అలా రైలు ఔటర్ సిగ్నల్ దాటేకా వాళ్లింట్లోంచి తెచ్చిన ఇడ్లీ పొట్లాల్లో ఒకటి నాకిచ్చి, ఇంకో పొట్లం తను విప్పుకున్నారు.
అన్వేషణ సినిమా మ్యూజిక్ కంపోజింగ్ కని మధురై వెళ్తున్నాం మేం.
స్పీడందుకున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి సుళ్లు తిరుగుతా వస్తుంది చలిగాలి. గాలి వస్తున్న వేపే ఒకానొక తన్మయత్వంతో చూస్తున్న ఇళయరాజా చాలాసేపయ్యేకా తల తిప్పి నన్ను చూస్తా, ‘‘నీదంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తయారుచేసుకోవడమే జరిగితే క్రియేటివ్ వరల్డ్ లో ఒకస్థానం నువ్వు సంపాదించుకున్నట్టే,’’ అన్నారు.

నిజమేచెమ్మీన్ తీసిన రామూ కరియత్ కి వో స్టైలుంది. బాలూ మహేంద్రకి స్టైలుంది.వీళ్ళు సరే మన తెలుగులో వాళ్ళదంటూ వాళ్ళకో స్లైలున్న మహానుభావు లెంత మంది లేరూ……
ఆయన మ్యూజిక్ ఆరుబార్లు వింటే ఇది ఇళయరాజాది అని చంటి కుర్రోడు కూడా చెప్పేసేంత అద్భుతమైన స్టైలు ఇళయరాజా కుంది.
రాగాన్ని రమ్యంగా మెలికలు తిప్పడం, రిథమ్ పేట్రన్ని అద్భుతంగా చెయ్యడం లోనూ (ఉదాహరణకి, అమ్మ నీ తియ్యనీ దెబ్బ పాటకి చేసిన రిథమ్) వీణ, ఫ్లూటు, వయొలిన్ల స్కోర్ రాయడంలోనూ, ఎరేంజ్ మెంట్స్ లోనూ ఆయనదంటూ తిరుగులేని స్టైలు, ఎన్నేళ్ళనించో ఎంతోమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన్ని కాపీకొడతా వస్తున్న అమోఘమైన స్టైలు తయారుచేసిన ఇళయరాజా అలా మాటాడ్తున్నారు.

ఆయన్లా ఒక ప్రత్యేకమైన స్టైలు తయారుచెయ్యడం నా జన్మకి కుదురుతుందాకుదరడమే జరిగితే నేనో అద్బుతం చేసినట్టే గదా!!!
కిటికీలోంచి బయటికి చూస్తున్న కారణజన్ముడ్నే చూస్తా ఆలోచిస్తున్నాను.
ఆయన తన సంగీత సాధన బ్రహ్మమూర్తంలో ఎలా ప్రారంభించి ఎలా చేసేవారో ఇంకోసారి రాస్తాను,
చిన్నప్పుడు వాళ్ల పణ్ణయపురంలో జరిగిన చాలా సంగతులు కాశీమజిలీ కథల్లా చెపుతుంటే చాలా రాత్రయిపోయింది. తెల్లవారింది.


బెర్త్ మీంచి లేచి చూస్తే పక్కనే వున్న బెర్త్ మీద పడుకున్నాయన ఎప్పుడు లేచేరో రాత్రిలానే కిటికీలోంచి చూస్తున్నారు.దూరంగా కనిపిస్తున్న కూలిపోయిన కోటగోడల్ని చూస్తున్నాయన ఏమను కుంటారో అని కూడా అనుకోకుండా, ‘‘ఏదన్నా కంపోజ్ చెయ్యొచ్చు కదా ఇప్పుడు ?’’ అన్నాను.
‘‘నా బెర్త్ కిందున్న హార్మోనియం పెట్టి బయటికి తియ్యి,’’ అన్నారు.
తీసి ఆయన ముందు పెట్టి అయిదు నిమిషాల్లో ఒక ట్యూన్ చేసి. “దీనికి ఇలాంటి సౌండొచ్చే వర్డ్స్ రాయించు కవిగారితోఅంటా తమిళంలో కొన్ని డూప్ వర్డ్స్ చెప్పేరు.
అలాగేఅని తర్వాతమద్రాసొచ్చేకాఇళయరాజా చెప్పినసౌండొచ్చే పదాలేచెపితే మహానుభావుడువేటూరిగారు,
ఏకాంతవేళాకౌగిట్లో
ఏకాంతసేవముచ్చట్లో
పడుచమ్మదక్కేదుప్పట్లో
దిండల్లేఉండూనిద్దట్లో
కవ్వింతగాఒళ్లు తుళ్లింతగా
మల్లెపూవుల్లొతావల్లె కన్నుల్లొవెన్నెల్లై
అన్నపల్లవి,తర్వాతచరణాలూ రాసేసిరికార్డింగప్పుడుఉండటానికి టైమ్లేక, విజయాగార్డెన్ నించిచక్రవర్తి గారుఫోన్ చేస్తేబయల్దేరెళ్ళి పోయేరు.
సరే…. వెనక్కొస్తున్నాను.
మధురైలోహోటల్ తమిళ్నాడుఅనే తమిళ్నాడు టూరిజం వాళ్ళ హోటల్లో దిగేం. సెంటిమెంటంట హోటల్లో క్వీన్ సూట్ లో దిగినాయన .గంట తర్వాత ఇన్ ఛార్జ్ కళ్యాణంతో నన్ను రమ్మని కబురు చేసేరు.
ఆయన ముందు కూర్చుని నా నోటికొచ్చిన సిట్యుయేషనేదో చెపితే ఒక కొత్తరకం పాట కంపోజ్ చేసేరు.
తర్వాత మద్రాసొచ్చేకా రికార్డింగ్ అయిన,” ఎదలో లయఎగసే లయ… “అన్న పాట విన్న ప్రొడ్యూసర్ కోవైతంబి గారు అచ్చం అలాంటి పాటే రాజాగారితో చేయించుకుని అచ్చం అలాగే పిక్చరైజ్ చెయ్యాలని గొడవ చేసేడు వాళ్ల డైరెక్టరయిన మణిరత్నంగారితో. మళ్లీ వెనక్కొస్తున్నాను.
ఆయనోగంట దొరికితేచాలు అనుకొనే బిజీరోజుల్లో నాఅన్వేషణ సినిమామ్యూజిక్ కంపోజింగ్కి రాజాగారిఇన్ ఛార్జ్కళ్యాణంతో గొడవపడిమూడు రోజులుసంపాదించేను.
కానీ, ఈయన మొదలెట్టినమూడు గంటల్లోమొత్తం పాటలకంపోజింగ్ అయిపోయింది.
మిగిలిపోయినటైంలో ఏంచెయ్యాలీ?’ అనుకుంటుండగా, “నాతో పాటురాఅంటా మధురైచుట్టుపక్కల వూళ్లల్లోఉన్న గుళ్లకితిరగడం మొదలెడ్తేఆయనవెనకాల నేను.

లంచ్టైములో, ‘‘నల్లముత్తుపిళ్లై రోడ్కెళ్లే దారిలోఒక హోటలుంటుంది. తిరునల్వేలి హల్వాఅక్కడ బాగుంటుంది, కృష్ణపాళయం సెకండ్స్ట్రీట్ మలుపులోఒక బిల్డింగ్బేస్ మెంట్లోవుండే నాన్వెజ్ హోటల్లోబిర్యానీ బాగుంటుంది, వెళ్లి తిను,’’ అంటా తనకికొట్టిన పిండైనమధురై నగరంలోఎక్కడ ఏమేందొరుకుతాయో, తనుఅన్నీ తినేరోజుల్లో ఎక్కడఏమేం తిన్నారోచెప్తుంటే వింటావుండిపోయేను.

మర్నాడుపొద్దుట మీనాక్షిగుళ్లోకెళ్తేఫారినర్స్ కితిప్పి చూపిస్తాగైడ్లు. గుడిమొత్తం తీరిగ్గాతిరిగి చూడాలంటేమినిమమ్ మూడురోజులుపడ్తుందటా విదేశీయులకి చెప్తున్నారు.
దర్శనం తర్వాత ఇళయరాజా గారి ఊరు పణ్ణయపురం బయల్దేరేం.
కొండ అంచునున్న చిన్న గ్రామం పణ్ణయపురం. కొండకి అటుపక్కకి దిగితే కేరళ.
రోడ్డు పక్కనే చిన్న చర్చి. దానిపక్కనే చిన్న ఇల్లు. అది రాజాగారికి పిల్లనిచ్చిన అక్కయ్యగారిది.
ఊళ్లోకెళ్లాం. గోపీచందనం రంగేసి ఖాళీగా వున్న చిన్న డాబా యింటిని చూపిస్తా, ఒకప్పుడిది చిన్ని పెంకుటిల్లు. నేను మ్యూజిక్ డైరెక్టరయ్యేకా అది పడగొట్టి డాబా కట్టారు మావాళ్లు,’’ అన్నారు.
ఐతే ఇంత గొప్ప ఇళయరాజాగారు పుట్టిన ఊరా ఇది, చదివిన స్కూలా ఇది, కలతిరిగిన వీధులా ఇవీ అనుకుంటా కలతిరగబోతున్న నన్నాపి, ‘‘కారెక్కు,’’ అన్నారు.
అక్కడ్నించి రకరకాల పల్లెటూళ్లు దాటుకుంటా వెళ్తుంటే కంకర రోడ్డు పక్కనే పెద్ద నిద్రగన్నేరు చెట్టు, దాని పక్కనే చిన్న బ్రిడ్జి. కారు ఆపమని దిగి, బ్రిడ్జి దగ్గర కెళ్తా, ‘‘ బ్రిడ్జిమీద కూర్చునే నేనూ మీ గురువు భారతీరాజా సాయంత్రాలప్పుడు చాలా కబుర్లు చెప్పుకునే వాళ్లం,’’ అంటా ఆనాటి సంగతుల్ని నెమరేసుకుంటున్నారు.
అచ్చమైన స్వచ్ఛమైన చిన్ని చిన్ని తమిళనాడు గ్రామాలు అందమైన తమిళం మాటాడుకుంటున్న జనం మధ్యలో వెళ్తుంటే ఇళయరాజాగారు చెప్తున్నారు.
వాళ్లు మొత్తం నలుగురు అన్నదమ్ములు. పెద్దాయన పేరు పావలర్ వరద రాజన్, రెండో ఆయన భాస్కర్, మూడు తను, నాలుగు అమర్ సింగ్ అనే ఇప్పటి గంగై అమరన్.
కమ్యూనిస్ట్ అయిన అన్న పావలర్ గారు మిగతా ముగ్గురు తమ్ముళ్లతో ఊళ్లు తిరుగుతా సినిమా పాటలకి కమ్యూనిస్ట్ సాహిత్యం చేర్చి పాడుకుంటా కచేరీలు ఇస్తున్న టైములో అక్కడే వున్న అల్లినగరం అనే పల్లటూరి మనిషైన భారతీరాజా పరిచయమయ్యేరు.
భారతీరాజాగారు డైరెక్ట్ చేసే నాటకాలకి ఇళయరాజాగారు మ్యూజిక్ చేసేవారు. ఆయనలా చెప్పుకుంటా పోతున్నారు… కారు కంకరబాటలూ మట్టిబాటలూ దాటుకుంటా పోతుంటే శీతాకాలం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చలిగాలి, బాగా చల్లగా వీస్తుంది. చీకటి చిక్కగా మూసుకుంటుంది.
అసలాయన మద్రాసు ఎలా వెళ్లాడు? ఆరంభంలో అక్కడ ఎలాంటి అవస్థలు పడ్డాడు? తండ్రి రాజయ్య అని పెట్టిన పేరు ఇళయరాజా ఎలా అయ్యిందీ? ఆయనకి మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఎలా వచ్చిందీ? ఒక సాదాసీదా ఇళయరాజా ఇంత గొప్పోడవడానికి వెనకాల రహస్యమేంటీ? ఇలా నాలో నేను ప్రశ్నలేసుకుంటా పోతున్నాను.
ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఇపుడో ఎపుడో ఆయన్నే అడగాలనుకుంటుండగా. చీకట్లో నూటయాభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన మా కారు మేం స్టే చేసినహోటల్ తమిళ్నాడుముందాగింది.
* * *
సినిమా కధ ఔట్ లైన్ దశలోనే ఉండగా పాటలు చేయించుకోడం జరిగింది.ఒక రకంగా పాటలు పక్కన పెట్టుకుని కధ అల్లుకోవాల్సిన సంక్లిష్టమైన పరిస్థితి నాది.అది ఏర్పడ్డానికి దాని వెనకాలో గమ్మత్తయిన కధ.
చాలా మంది రైటర్లు ఈరకం కధ మా వల్లగాదని వెళ్ళి పోయేరు.దాంతో నేనొక్కడ్నే ప్రొడక్షవానాఫీసులో కూర్చుని రాత్రీపగలనక అవస్థలు పడ్తున్నాను.
షూటింగ్ డేస్ దగ్గర పడ్డంతో టెన్షన్ పెరిగి పోతున్న నిర్మాతలు నా దగ్గర కొచ్చి నన్ను చూసి మాటాడలేకపోతున్నారు.

ఇంతలో ఇందిరాగాంధీ చని పోవడం ,షూటింగులన్నీ ఆగిపోడం .నాకో ఎడ్వాంటేజయ్యింది.
రాత్రీపగలూ అవస్థపడతా వెనకటికొచ్చిన వెండితెరనవల లాగ రాసిన కధచెప్పమన్న వాళ్ళకి నవలిచ్చేసి చదూకోమంటన్నాను.
* * *
తలకోనఅడవుల్లో షూటింగ్.
షూటింగ్డేస్ నలభైరోజుల పైనే.
అయ్యాకారాయపేటలో ఉన్నమద్రాస్ సినీలేబ్లో ఎడిటింగ్,ఎగ్మూర్మ్యూజియం ఎదురుగుండా ఉన్నబాలాజీ దియేటర్లో డబ్బింగ్.
* * *
రీరికార్డింగ్ కి రెడీ అయిన డబుల్ పాజిటివ్ ని ఆయన పద్దతి ప్రకారం చూసిన ఇళయరాజా గారుమొత్తమంతా మ్యూజిక్కే ….ఇంగ్లీష్ సినిమాలాగుంది.అనేటప్పటికి ఆనందంతో నిద్రపట్టలేదారాత్రి.
ప్రసాద్ డీలక్స్ లో రీరికార్డింగ్ జరుగుతున్న టైములో ఒక ఫారినర్ వచ్చి ఒక రీల్ కి చేస్తున్న రీరికార్డింగ్ మొత్తం చూసేడు.అతనేదో ఇంగ్లీషు మేగజైన్ కి సంబంధించినోడను కుంటాను.ఇళయరాజాగారు పనిచేసే స్టైలు చూస్తా ఫొటోలు తీసుకుంటా తెగ రాసేసుకుంటున్నాడు.
రీల్ చూడ్డానికి పది నిమిషాలు.
పక్కనించి నోట్సు రాసుకుటానే,మ్యూజిషియన్స్ కి డిక్టేట్ చెయ్యడానికి గంట.
మ్యూజీషియన్స్ రిహార్సల్స్ చేసేక రీల్ రన్నింగ్ టైమ్ లోనే మోనిటర్ చూస్తా కరక్షన్స్ చెప్పడానికి పదిహేను నిమిషాలు.
ఫుల్ రీల్ టేక్ చెయ్యడానికి దాని రన్నింగ్ టైమే పది నిమిషాలు.
అటుగా ఇటుగా మొత్తంగా చూసుకుంటే మొత్తం గంటన్నరలో మొత్తం రీల్ మ్యూజిక్ చేసిన ఇళయరాజాని
చూసి షాక్…..ఇంత తక్కువ టైములో ఇంత హెవీవర్కు??? ప్రతీ బార్లోనూ ఇంత క్రియేటివిటీ!!!
షాకయి పోతా అతనలా అంటుంటే విన్న వయొలినిస్ట్ నరసింహన్ గారు రీల్స్ లో మ్యూజిక్ ఫుల్ గా వుంది గాబట్టి ఇంత
టైము.లేకపోతే ఒక రీలు మ్యూజిక్ కి ఆయన తీసుకునే టైము కేవలం నలభై అయిదు నిమిషాలేఅనేటప్పటికి మూర్చొచ్చి పడి పోయేడా
ఫారినర్.
ఇంతకీ ఎవరా మనిషి ? అని ఎంక్వైరీ చెస్తే…… ది గ్రేట్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మేగజైన్ సౌండ్ అండ్ సైట్ తాలూకు
రిపోర్టరంట. ఏసినిమా అయినా సరే నాలుగు సెవెన్ టూ నైన్ కాల్ షీట్స్ లో రీరికార్గింగ్ ఫినిష్ చేసే రాజాగారు,ఈసినిమాకి సెవెన్ సెవెన్ టూ నైన్ లు పని చేసినా టైటిల్స్ మిగిలి పోయినియ్యి.
* * *
సిన్మా ఫస్ట్ కాపీ అదే ఫైనల్ ప్రోడక్ట్ బయటి కొచ్చింది. దాన్ని చూసిన రామోజీరావు గారు నచ్చలేదని ,ఎందుకు నచ్చలేదో రీజన్స్ చెప్పేరు.చాలా సబబుగా చెప్పేరాయన అనిపిచింది. నీ టెక్నిక్ తో మాయ చేసేవు తప్ప సినిమాలో ఏం లేదన్నారు వేమూరి సత్యనారాయణగారు. ఏడిద నాగేశ్వర్రావుగారింట్లో ఎవరికీ నచ్చలేదు.నా మీద నిత్యం వాత్సల్యం కురిపించే నాగేశ్వర్రావుగారి భార్య జయగారుసితార తీసిన నువ్వేనా పిచ్చి
సినేమా తీసిందీ…” అంటా మందలించేరు.
బోరు కొట్టిందన్నారు కొంత మంది.
అర్ధం కాలేదన్నారు కొంత మంది.
అండర్ ప్రొడక్షన్ లోనే మొత్తం సినిమా కొన్న బయ్యర్లైతే ఏం చెయ్యాలా అని అటూ ఇటూ వూగు తున్నారు.
మొత్తానికి రిలీజైన అన్వేషణ సినిమా హిట్టైంది.హైదరాబాద్ దేవి దియేటర్లో వందరోజులాడింది.
అప్పటికింకా సినిమా ఫీల్డుకి రాని రామ్ గోపాల్ వర్మ,తన రూమ్మేట్ సుబ్రమణ్యంతో కలిసి ఇరవై రెండు సార్లు చూసేరం. ఆయన సినిమాని మెచ్చుకున్నందుకు ఆనందపడ్డా,కొంత మంది ప్రముఖులకి ఎందుకు నచ్చలేదో అన్న ఆలోచనలో పడ్డాను.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్లీ కలుస్తున్నారా??

Tue Jan 15 , 2019
పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్లీ కలుస్తున్నారా?? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి 2019 సాధారణ ఎన్నికలకు గట్టిగా ఇంకొక  ఐదు నెలలు కూడా సమయం లేకపోవడంతో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ద్వారా చివరికి ఎలాగో గట్టెక్కి అధికారంలోకి రాగలిగారు. ఆ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: