ఈ సంవత్సరం తెలుగు సినిమా నేర్చుకున్నదేంటి??

ఈ సంవత్సరం తెలుగు సినిమా నేర్చుకున్నదేంటి??పది పట్టుమని పది శాతం కూడా సక్సెస్ రేటు లేదు ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. పెద్ద పెద్ద  స్టార్ లతో భారీ బడ్జెట్లు క్రేజీ కాంబినేషన్లు ఇవేవీ కూడా ఈ సంవత్సరం పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. చిన్న బడ్జెట్ తో అందరూ కొత్తవాళ్లతో తీసిన సినిమాలు కూడా జనాలని బాగా ఆకర్షించాయి. దీని అర్థమేంటి తెలుగు సినిమా మారుతుంది ఆ మాటకు వస్తే ఒక్క తెలుగు సినిమానే కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా సినిమానే మారుతుంది. ఈ సినిమాలో పెద్ద పెద్ద సూపర్ స్టార్ లు ఉన్నారా భారీ బడ్జెట్లు ఉన్నాయా గ్రాఫిక్స్ బాగుందా అని జనాలు చూడడం లేదు మంచి కథ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. ఏ సినిమాకైనా కావలసింది మంచి కథ ఎన్నో ఏళ్లుగా ఎంతో గొప్ప గొప్ప దర్శకులు  ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు అనదగ్గ అకిరా కురసోవా, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాంటి వాళ్లు చెప్పిన విషయం కూడా ఒకటే ఏ సినిమాలోనైనా మంచి కథ ఉంటే కచ్చితంగా అది ప్రేక్షకులను రంజింప చేస్తుంది అని.

ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలో తీసుకుంటే మంచి కథ లేకపోవడం వల్లే మన దగ్గర బడా హీరో లు అనదగ్గ వాళ్లందరూ కూడా పరాజయాలు చవి చూడాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు మాస్ లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు గత కొన్ని సంవత్సరాల వరకు ఆయన కనిపిస్తే చాలు సినిమా ఆడేస్తుంది అనుకునే వాళ్లందరికి కూడా ఈ సంవత్సరం అజ్ఞాతవాసి సినిమా భారీ ఫ్లాప్ అవడంతో కేవలం హీరో మాత్రమే కనిపిస్తే చాలదు సినిమాలో మంచి కథా కథనాలు ఉండాలి అన్న విషయం తెలిసి వచ్చింది. 
ఇంతవరకు పక్కా కమర్షియల్ మాస్ సినిమాలు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తొలిసారిగా తన సర్కిల్ నుంచి బయటకు వచ్చి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో ఒక చెవిటి వాడి పాత్ర పోషించాడు ఆ సినిమాలో ఉన్న కథ కథనాలు రామ్ చరణ్ నటన ఇవన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సంవత్సరం లోనే అత్యంత భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని రంగస్థలం సినిమా నమోదు చేసుకుంది. అలాగే మహానటి, కంచరపాలెం, గూడచారి, అంతరిక్షం ఇలా ఈ సంవత్సరం తెలుగులో కూడా కొత్తదనం ఉన్న కొన్ని సినిమాలు వచ్చాయి. మంచి కంటెంట్ ఉంటే మేము ఎప్పుడూ సినిమాల్ని ఆదరిస్తామని మన తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రతిసారి రుజువు చేస్తూనే ఉన్నారు అందుకు సాక్ష్యమే పరభాషా హీరోలు, వాళ్ళ సినిమాలు ఇక్కడ అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టడం. ఎక్కడో మారుమూల ప్రాంతీయ భాష లో తీసిన సినిమాలో కూడా మంచి కథ ఉంటే ఆ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

              Image credited from google.com

కళకు ఎల్లలు లేవు. సినిమా కళకు అసలే లేవు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మన దగ్గర పెద్ద హీరోలుగా, హీరోయిన్లుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అంటే కేవలం వాళ్లలో ఏదో ఒక కొత్తదనం ఉండడం ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించడo వల్లనే. కొత్త ఒక వింత పాత రోత అన్నారు నిజం చెప్పాలంటే ఏదో వ్యగ్యానికి  ఈ సామెత చెప్పుకుంటుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనిస్తే కచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం కాలం మారుతుంది వేగంగా మారుతుంది కళ్ళు మూసి తెరిచేలోగా ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అన్ని రంగాల్లో కొత్త పంథాలో వెళ్తున్నారు అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మందిని అలరించే సినిమా రంగం ఎందుకు కొత్త ఆవిష్కరణలని అందిపుచ్చుకోదు ఇంకా మూస ఎందుకు??
తెలుగు సినిమా పరిధి పెరిగింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మనకున్న మార్కెట్లను కూడా బాగా పెంచుకోగలిగాం సినిమా బడ్జెట్ లు కూడా మారుతున్నాయి ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమాకి 100 కోట్లు పెట్టడానికి కూడా నిర్మాత ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాను పెట్టిన పెట్టుబడి కచ్చితంగా తిరిగి వస్తుందని నమ్మకం సదరు నిర్మాతల్లో నెలకొంది. మరొకవైపు శాటిలైట్ హక్కులతో పాటు కొత్తగా వచ్చిన అమెజాన్, నెట్ ఫ్లిక్స్ అని డిజిటల్ సినిమా రైట్స్ కూడా మన వారికి బాగానే గిట్టుబాటు అవుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ సంతోష పడకుండా అసలు మనం తీస్తున్న సినిమాల్లో కథా కథనాలు ఎలా ఉన్నాయి ఏమైనా కొత్తగా ప్రయత్నిస్తున్నామా ప్రేక్షకుల అభిరుచికి తగిన మనల్ని మనం మార్చుకుంటున్నామా అని ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి సదరు నిర్మాతలు గాని, హీరోలు కానీ, దర్శకులు కానీ తమను తాము ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే కచ్చితంగా తెలుగులో చాలా గొప్ప సినిమాలు వస్తాయి.
కొత్తదనం అనేది మన తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు ఎప్పుడో  1957 లోనే మనవాళ్లు మాయాబజార్ అనే సినిమా తీశారు ఈ రోజు కూడా ఆ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ కానీ కథాకథనాలలో గాని పాత్రలలో కానీ సంభాషణలలో కానీ పాత్రల పేర్లలో కానీ కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సాంఘిక పౌరాణిక జానపద సామాజిక సైన్స్ ఫిక్షన్ ఇలా ఒకటేమిటి అన్ని జానర్ లలో సినిమాలు తీసిన అత్యంత గొప్ప చరిత్ర కలిగిన సినిమా మనది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళా వాచస్పతి జగ్గయ్య, విశ్వనటుడు ఎస్వీఆర్ ఇలా ఎందరెందరో మహానుభావులను మనం ఎప్పుడో చూశాం వాళ్ళందరూ కూడా తమ తమ కెరీర్ లో కొత్తగా ప్రయత్నించిన వాళ్ళే కొత్త పాత్రలతో కొత్త కథలతో సినిమాలు తీసినవారే. కానీ ఇప్పుడున్న హీరోలు తమ ఇమేజ్ అంటూ, అభిమానులు అంటూ ఒక మూసలో బతికేస్తున్నారు మూస సినిమాలనే తీస్తున్నారు ఇప్పటికైనా ఈ పద్ధతి మారాలి ఒక పక్క పరభాషల్లో గొప్ప గొప్ప సినిమాలు వస్తూ అవార్డులు రివార్డులు అన్నిటినీ సంపాదించుకుంటుంటే మన వాళ్లకి ఎందుకు ఈ లేనిపోని మాస్ మసాలా సినిమాలు, హీరో బిల్డప్పులు, ఐటెం సాంగులు ఈ రోజుకైనా వీటన్నిటిని వదిలేసి కథలో కొత్తదనం పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించాలి.
మరొకవైపు డిజిటల్ విప్లవం తరుముకొస్తోంది ఏ మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రేక్షకుడైన సినిమా ధియేటర్ వరకు రాకుండా తన ఇంట్లోనే కూర్చుని తనకు నచ్చిన సినిమా చూసుకునే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు తామే నిర్మాతలుగా చాలా భిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా నిర్మితమైన సినిమాలను కూడా మన తెలుగు ప్రేక్షకులు తన ఇంట్లో తన కంప్యూటర్లో చూసుకునే అవకాశం దొరుకుతుంది తన ఇంట్లో కళ్ళముందే పంచభక్ష పరమాన్నాలు దొరుకుతుంటే సగటు సినీ ప్రేక్షకుడు ఎందుకు సినిమా థియేటర్ వరకు వచ్చి ఫలానా హీరో సినిమా చూడాలి? 
ఎందుకు ఆ హీరో ఇంట్రడక్షన్ కోసం విజిల్ వేయాలి? ఎందుకు ఐటంసాంగ్ లో కేరింతలు కొట్టాలి? ఈ రోజుల్లో కొత్తదనం లేకపోతే అది విజయవంతం కావడం లేదు అది వస్తువైనా సినిమా అయినా  బిజినెస్ అయినా  ఏదైనా సరే అందుకే ఇప్పటికైనా తెలుగు సినిమా నిర్మాతలు దర్శకులు హీరోలు మేల్కొంటే కచ్చితంగా మన దగ్గర కూడా కొత్త సినిమాలు వస్తాయి మన సినిమా కూడా మారుతుంది మనం కూడా మూస నుంచి బయటపడొచ్చు. ఇది అతి తొందర్లోనే జరుగుతుందని తెలుగు సినిమా అంటే అవే పాత రొటీన్ మూస సినిమాలు అని చెప్పుకునే స్థాయి దగ్గర్నుంచి కొత్తదనం అంటే తెలుగు సినిమా తెలుగు సినిమా అంటే కొత్తదనం అని చెప్పుకునే స్థాయికి మన సినిమా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరానికి మరిన్ని కొత్త సినిమాలకు స్వాగతం పలుకుదాం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టాప్ టెన్ బాలీవుడ్ మూవీస్ 2018

Wed Dec 26 , 2018
టాప్ టెన్ బాలీవుడ్ మూవీస్ 2018 1. అందాదున్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాధికా ఆప్టే ముఖ్య పాత్రలు పోషించారు. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో ఒక గుడ్డి పియానో ప్లేయర్ గా నటించాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 2. బదాయి హో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: