డైరెక్టర్ వంశీ గారి నేపాల్ ముచ్చట్లు

డైరెక్టర్ వంశీ గారి నేపాల్ ముచ్చట్లు

అన్వేషణ సితార లాంటి మంచి అభిరుచి గల సినిమాలు తీసిన వంశీ గారు మరొక్కసారి పంచుకున్న తన నేపాల్ అనుభవాలను మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.
ఇంకా రెండున్నర గంటలగ్గానీ ఖాట్మాండ్ ఫ్లైట్ బయల్దేరదంట. ఆకలిగా ఉందంటా మా జనాలగోల. మంచి వెజిటేరియన్ బ్రేక్ ఫాస్టెక్కడ దొరుకుతుందా అని వెతకడం మొదలెట్టాం ఆ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో. క్రోమా, డామీవేంజ్, బోగి, మేంగ, గార్డియన్ ఎపిసోడ్- ఇలా చాలా షాపుల మధ్య ఇడ్లీ.కామ్ అనే రెస్టారెంట్ట్‌లో సాంబారు అద్భుతం.
షాపులన్నీ కలతిరుగుతా ఫోటోలు తీస్తా కాలక్షేపం చేస్తూంటే స్పీకర్లలోంచి పియానో కాన్‌సెర్ట్ వస్తుంటే ఆగిపోయాను. అది యానీ తాజ్‌మహల్ ముందు వాయించింది.
టైమయ్యాకా ఖాట్మాండ్ ఫ్లైట్ బోర్డింగ్ ఎనౌన్స్‌మెంట్ వినిపిస్తే బయల్దేరాం. బెంగుళూరంత కాదుగానీ ఖాట్మాండ్ ఎయిర్‌పోర్ట్ కూడా బానే వుంది.

ఊరి చివర్న కొండ అంచున వందల ఎకరాల్లో ‘పార్క్ విలేజ్’ అనే హోటల్లో దిగి, స్నానాలూ ఫలహారాలూ అయ్యేకా తనికెళ్ళ భరణి, “మన ముగ్గురు హీరోయిన్లలో ఓ హీరోయిన్ ఈ దేశం మనిషి కాబట్టి ఈ ఊళ్ళల్లో తిరుగుదాం,” అన్నాడు. ‘సరే’ అని టాక్సీ మాటాడుకుని బయల్దేరాం. మారుతి 800, టయోటాలు, షేర్ ఆటోల్లా తిరిగే చైనా వేన్లూ, శాం, నిస్సాన్ ఇంపాలా ఇవే కార్లు. ముందు పశుపతి టెంపుల్ కెళ్ళాం. స్మశానంలో వుందా ఆలయం.
విచిత్రం, ఆ గుళ్ళో పూజార్లు కన్నడం వాళ్ళు. జనార్దన మహర్షి వాళ్ళతో కన్నడంలో మాటాడ్తే చాలా సంబరపడ్డారు వాళ్ళు. అంత రష్‌లోనూ మమ్మల్ని లోపలికి పిల్చి ప్రత్యేక దర్శనం చేయించి తలో రెండు రుద్రాక్ష దండలిచ్చారు.
దేవాలయ ప్రాంగణంలో ఆనాటి నేపాల్ రాజుల విగ్రహాలు. మూడు విగ్రహాలకి కళ్ళద్దాలు కూడా ఉన్నాయి. ఇంకోచోట నవదుర్గల విగ్రహాలున్నాయి. మరోచోట నగ్నమైన కాలభైరవుడు ఉన్నాడు. పెళ్ళి కాని అమ్మాయిలు అతని మర్మాంగానికి తల తగిలిస్తున్నారు. ఒక అందమైన అమ్మాయి ఆ దేవుడి మర్మాంగానికి రెండుసార్లు తల తాకించి మొక్కుకుంటుంటే అనుమానమొచ్చిన భరణి, “గుర్తు పెట్టుకోవాల్సిన పాయింటు, ఇంతందమైన పిల్లకి పెళ్ళిగాకపోవడమేంటి?’’ అన్నాడు.తలెత్తి చూసినా పిల్లది ఆంధ్రా అంట.
మొహాలెక్కడ పెట్టుకోవాలో తెలీక బయటకొచ్చేశాం. మేం గుళ్ళోకెళ్ళబోయే ముందు మాకు పూల సజ్జలిచ్చిన వాళ్ళ దగ్గరే చెప్పులు పెట్టాం. కానీ గుళ్ళోంచి బయటికొచ్చి కొంతదూరం వచ్చాక గుర్తుకొచ్చింది, హైదరాబాదు పంజాగుట్ట చౌరస్తాలో వున్న మోచి షాపులో కొన్న నా చెప్పులు అక్కడ మర్చిపోయిన సంగతి. ఇది అమ్మిరాజుకి చెప్తే, ‘‘వది లెయ్యండి, ఇక మీకంతా మంచే జరుగుద్ద’’న్నాడు.
ఆ తర్వాత ఖాట్మాండ్‌లో వున్న కొండమీద ఆ రాజులకోట ఎక్కుతా ఒక గైడుని మాటాడుకుని వాడ్ని ఫాలో అయ్యేం. అదో పెద్దగుట్ట. ఆల్మోస్ట్ కొండ. దానిమెట్ల కెడాపెడా రకరకాల బొమ్మల కొట్లు. పాపం వాళ్ళు బతికే విధానం ఇండియాకంటే చాలా హీనం. మన రూపాయి వాళ్ళకి రూపాయి అరవై పైసలంట.
ఈ చిన్న నేపాల్‌ను పదిహేడో శతాబ్దంలో మూడు రాజ్యాలుగా విడగొట్టుకుని ముగ్గురన్న దమ్ములు పాలించారు. వాళ్ళంతా మహా భక్తులు. ఒకళ్ళ మీదొకళ్ళు పోటీపడి నూట ఇరవై కిలోల అమ్మవారి విగ్రహం పోత పోయించారు. అదింకా వుంది.
అక్కడికి మేం వెళ్ళేటప్పటికి చాలా మంది గన్‌మేన్లు ఆ విగ్రహానికి సెక్యూరిటీగా వున్నారు. దసరా రోజు తలుపులు తెరిచి ఆ అమ్మోరికి దున్నపోతుని బలిచ్చి మళ్ళీ తలుపులు మూసేస్తారంట. ‘‘ అమ్మోరి పేరు కుల్జాభవానీ. ఆ ఎంట్రి చెక్కడానికి నూట ఇరవై ఏళ్ళు పట్టిందంట.
చెక్కడం పూర్తిచేసిన ఆ దారుశిల్పి చేతులు నరికి అక్కడే సమాధి చేసేరంటతన్ని. గైడు ఆ సమాధి కూడా మాకు చూపిస్తుంటే నాలుగుపక్కలా కిందికి మెట్లున్న చిన్న చెరువు కనిపించింది. అదేంటన్నాం. చెప్తాను పదండని మమ్మల్నే ఏభై అయిదు కిటికీలున్న రాజభవనం దగ్గరికి తీసుకెళ్ళి సెక్యూరిటీతో పాటు రాజుగారు రోజూ ఈ భవనంలోంచొచ్చి మీరేంటనడిగిన ఆ చెరువులో స్నానం చేసేవారంట అన్నాడు. ముందుకి నడుస్తున్న మాకు చాలా గమ్మత్తుగా వున్న ఓ భవనం కనిపించింది.
ఆ రోజుల్లో సైనికుల గెస్ట్ హౌసంటది. తెల్లరాతితో కట్టిన సిద్ధలక్ష్మీ టెంపుల్నీ, అప్పుడప్పుడూ రాజులొచ్చి రెస్ట్ తీసుకునే గెస్ట్‌హౌస్ నీ చూపించాకా చెప్పడం మొదలెట్టాడా గైడు. “ఈ ఊళ్ళో మూడు గజాలస్థలం తొంభై లక్షలు. ఎందుకంటే ఇది టూరిస్టు ప్లేసు. ఎయిర్ పోర్ట్‌లో రోజుకి పాతిక విమానాలు ఆగుతాయి. అందులోంచి దిగేవాళ్ళంతా టూరిస్టులే” అన్నాడు. అర్ధనగ్నంగా డాన్సులూ, వ్యభిచారం లాంటివి ఏ దేశం అమ్మాయిలన్నా వచ్చి చేయొచ్చుగానీ, ఈ దేశపు స్త్రీలు చేస్తే చాలా పెద్ద శిక్షపడ్తుందటాళ్ళకి. దారి పొడుక్కీ చాలా ఆర్ట్ స్టూడియోలు కనిపించాయి.
మా కళ్ళముందే గొప్ప గొప్ప చిత్రకారులు గీస్తున్న గొప్ప గొప్ప కళాఖండాలు ఆరొందలకి మూడొందలకీ అమ్ముతుంటే నేనో పెయింటింగ్ కొన్నాను. కొంతదూరమెళ్ళాకా ఓ స్టూడియోలోకి తీసుకెళ్ళి, “ఇది నా సొంత స్టూడియో మీకేమన్నా కావాలంటే కొనుక్కోండి,చాలా తగ్గించి ఇస్తాను” అన్నాడు. అక్కడ ఇద్దరు ఆర్టిస్టులు గీస్తున్న తాంత్రిక చిత్రాలు చాలా నచ్చాయి మాకు. రెండు రోజులపాటు ఖాట్మాండంతా కలతిరిగిన మాకు రకరకాల కారెక్టర్లు కనిపించాయి.ఆ ఊరికి అలంకారం లాంటి తామిక్ బజార్‌లో అన్నీ దొరుకుతాయి.
అసలక్కడ దొరకని వస్తువుండదు. పగలుకంటే రాత్రి జీవితం చాలా గొప్పదా బజార్‌లో. ఏభై నుంచి అరవైదాకా వున్నాయి వీధులు. బట్టలూ, బంగారమూ, చిత్రవిచిత్రమైన చెప్పులూ, గొడుగులూ ఆడాళ్ళు అలంకరించుకునే అందమైన ఐటమూ… ఏ షాపులో చూసినా టూరిస్టులే.
ఆ వేళ పొద్దుట చాలా ప్లెజంట్‌గా వుంది వాతావరణం. తుంపర్లు పడ్తున్నాయి పోక్రా వెళ్ళడానికన్నీ సర్దేసుకున్నాంగానీ టిఫిన్లు రెడీ అవ్వలేదు. హోటలు వాళ్ళని ఒకటే తొందర చేస్తున్నాడు అమ్మిరాజు.
ఇక మహర్షయితే మా ప్రోగ్రామ్ మేం రాత్రే చెప్పాంగదా అంటా ఒకటే కేకలు.

మొత్తానికెలాగయితేనేం ఖాట్మాండ్ డొమెస్టిక్ విభాగంలోకొచ్చేం. మా ఫ్లాట్ నెంబర్ 0521. తొమ్మిది పదికల్లా బయల్దేరిపోద్దని నానా హైరానా పడొస్తే, 11.30కి లేండ్ అవుద్దంటది. టేకాఫ్ టైమ్ చెప్పట్లేదాళ్ళు. బయట ఒకటే గాలీవానా.
బేగ్‌లో వున్న కెమెరా తీసుకుని పాసింజర్లని ఎక్స్‌పోజ్ చెయ్యడం మొదలెట్టాను. రకరకాల గెటప్పుల్లో వున్నాళ్ళవి రకరకాల కేరెక్టర్లు. కొందరు నవ్వుతున్నారు, కొందరు విసుక్కుంటున్నారు, కొందరు కోప్పడుతున్నారు. ఒక జర్మనమ్మాయైతే నా ఫోటోలు సెండ్ చెయ్యి అని తన ఈమెయిల్ ఐడి ఇచ్చింది.
బుద్దా, అగ్ని, గుణ, తార, యతి ఆ చిన్న ఎయిర్ పోర్ట్లో ఎన్నిరకాల ఎయిర్‌లైన్సు!!!
చాలా ఫోటోలుతీసి అలిసిపోయిన నా దగ్గరకొచ్చిన జనార్థన మహర్షి కన్నడ హీరో రాజ్ కుమార్‌గారి గురించి అద్భుతాలు చెప్పాడు. తనికెళ్ళ భరణి సత్యజిత్ రే రాసిన మన సినిమాలూ వాళ్ళ సినిమాలు పుస్తకం చదూతా జల్సాఘర్ గురించి చెప్తున్నాడు.

నాకు తెల్సయ్యా బాబూ అంటున్నా వినడం లేదు. ఇంకోసారి విందురూ అంటున్నాడు. పన్నెండున్నర దాటేకా ఎనౌన్స్‌మెంట్ మా ఎయిర్‌క్రాఫ్ట్‌లో కెళ్ళడానికి బస్సెక్కించారు. పదహారు సీట్లు మాత్రమే వున్న ఆ చిన్ని విమానంలో కాక్‌పిట్ తర్వాత మొదటి సీటు నాదే. చాలా చక్కగా మాటాడిన ఎయిర్‌హోస్టెస్ ఇంకాస్సేపు మాటాడితే బాగుండ్ను అనుకునేలోపు ఫైట్ పోక్రా ఎయిర్ పోర్ట్లో లేండయింది.
కొండల మధ్య వుందా పోక్రా వూరు. ఆకాశం నిండా నీలం మబ్బులే. వర్షమింకా కురవట్లేదు. రెండు టెక్సీలెక్కి బరాహి అనే హోటల్‌లో దిగాం. ఆ హోటలు చుట్టూ పనసచెట్లు, మామిడిచెట్లూ, రావులపాలెం సి.ఆర్.సి. క్లబ్బులో దిగినట్టుంది నాకు.
వాతావరణం లాగే అక్కడి మనుషులు టూరిస్టులకిచ్చే మర్యాద చూసిన అమ్మిరాజు కళ్ళమ్మట నీళ్ళు తిరిగినియ్యి. పొద్దుట్నుంచి ఆకాశాన్ని మూసిన మబ్బులలాగే వున్నాయిగానీ గాలిజోరు పెరిగింది. వర్షం మాత్రం కురవట్లేదు.
పగలంతా పన్దేసి ఆ సాయంత్రం పూట బజార్లో పడ్డాం. ఏ పక్కకి జూసినా షాపులే. రకరకాల పూసలదండలూ, బుద్ధుడూ, శివుడూ, మహాదేవీలాంటి దేవుళ్ళ కంచుబొమ్మలు. కొన్ని బిల్డింగ్స్ పైనున్న పబ్బుల్లో క్లబ్బుల్లో అమ్మాయిల డాన్సులు. ఒకచోట ముసిలోడు సారంగి మీద ఆహిర్ భైరవి రాగం వాయిస్తే వింటా అలాగుండిపోయిన జనార్ధన మహర్షి ఇరవై రూపాయలిచ్చేడతనికి.
వాడు ఆరొందల ఏభై రూపాయలకి మొత్తం సారంగి కొనుక్కోండి అంటా బతిమాలడం మొద లెట్టాడాడు. వద్దురా నాకది వాయించడం రాదంటే వినడే. మధ్యలోకి దూరిన భరణి బ్రదర్ శ్రీను ఆ గొడవ సెటిల్ చేశాక ఆ బజారుకి ఎడంపక్కనున్న ఇంకో వీధిలో నడుస్తున్నాం.
అక్కడ కూడా ఈ దుకాణాలే. ఒక షాపులోకి మూడు కిలోల మహాదేవి విగ్రహం నాకు నచ్చితే మొన్న జూలై ఐదున బర్త్ డే జరిగిన నేనెరిగినొక స్త్రీకి గిఫ్ట్ ఇద్దామనిపించి భరణిగారి బ్రదర్ శ్రీనివాస్‌తో బేరమాడించి కొందామనుకుంటా జేబులో చెయ్యెడితే వాళ్ళ నేపాల్ కరెన్సీ లేదు. పక్కనున్న అమ్మిరాజు దగ్గర చేబదులు తీసుకుని ఆ మహాదేవి కంచు విగ్రహంతో పాటు ఆమె మెళ్ళోకే వేయడానికి కారు నలుపులాంటి చీకటి రంగు పూసల దండ కూడా కొన్నాను.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో వున్న కెన్స్ హోటల్లో డిస్కషనప్పుడు మా ముగ్గురు హీరోయిన్లలో ఓ హీరోయినుండేది నాగాలేండ్‌లో అయితే బాగుంటది అన్నాడు భరణి. కాదులే ముందనుకున్నట్టు ఖాట్మాండు అన్నాన్నేను. “మరైతే ఆ అమ్మాయెక్కడుంటదంట?”అన్నాడు భరణి. కిటికీలోంచి మాకు కనిపిస్తున్న ఎత్తైన కొండల మీదున్న కొన్ని గ్రామాలు కనిపించాయి.
అన్నింటికంటే ఎత్తయిన కొండమీదున్న ఆ గ్రామం పేరు కనుక్కున్నాం. సముద్రమట్టానికి పద హారొందల మీటర్ల ఎత్తున్న ఆ గ్రామం పేరు షరామ్ ఫోర్ట్. అంత పైనున్న ఆ గ్రామంలో హోటల్సూ, గెస్ట్ హౌస్లూ కూడా వున్నాయి. ‘‘ఆ ఊళ్ళో వుంటే?” అన్నాన్నేను.
మర్నాడు కారు మాటాడుకుని ఆ కొండలెక్కాం. దార్లో బోల్డు మజిలీలు. ఆ గ్రామంలో ప్రజలు కొండల్లోంచి గొర్రెల జుట్టు కత్తిరించుకొచ్చి స్వెట్టర్లు అల్లుతున్నారు. శాలువాలు నేస్తున్నారు. అక్కడక్కడా హోటళ్ళు, గెస్ట్ హౌస్లు. ఒకచోట ఎరుపురంగు గోడలూ దానిమీద పచ్చటి రేకులూ వున్న ఇల్లొకటి కనిపించింది.
ఇదే మన మూడో హీరోయిన్ ఇల్లనుకుని చాలా ఫోటోలు తీశాక ఇంకా ఇంకా పైకెక్కాం. భూమికి ఎనిమిది వేల మీటర్ల పైనున్న సెల్ ఫోన్ టవర్ల కింద కాసేపు కూర్చున్న మాకు హిమాలయ పర్వతాల కొమ్ములు కనిపిస్తున్నాయక్కడ్నించి.
పల్చగా వున్న ఆ గ్రామం ప్రజల మాటల్లో అరకులో గాలికొండంత నీతి నిజాయితీ వుంది. బోల్డంత మర్యాద. మోసం లేదు, దగా లేదు. ఆ కొండ దిగబుద్ధవ్వలేదు. దిగుతున్నప్పుడు తనికెళ్ళ భరణి చెప్పాడు. హిమాలయాల్లో ఆనందా అనే హోటలుందంట. ఈ భూ ప్రపంచంలో వున్న మల్టీ మిలియనీర్లంతా ఆ హోటల్లో దిగుతారంట… చాలా కాస్ట్లీ హోటలది. అందులో ప్రత్యేకతేంటంటే దిగిన కస్టమర్ ఈ ప్రపంచంలో ఏ మూల ఏ వస్తువు అడిగితే, ఇరవై నాలుగ్గంటల్లో తెచ్చిస్తారంట అన్నాడు.
తెల్లారింది. వర్షం తాలూకుతుంపర్లు ఇంకా పడతానే వున్నాయి. ఒక పక్కకి ఒంగి ఏ చప్పుడూ చెయ్యని వెదురుచెట్లు, దూరంగా వున్న గెస్ట్‌హౌస్ షెల్టర్‌లో ఎర్రస్వెట్టరేసుకుని చదూకుంటున్న ఇంగ్లీష మ్మాయి, ఎప్పుడూ నవ్వుతా వుండే హౌస్ కీపింగ్ అమ్మాయి కింద తడి గచ్చుమీద తుడుచుకుంటూ పోతుంది.
కొండమీద బుద్దుడి గుడి ఆయన్లాగే ఏ చప్పుడూ చెయ్యకుండా వుంది. మొత్తానికి ప్లెజెంట్గా వున్నా వాతావరణంలో వెకేట్ చేస్తున్నాం. నేనున్న రూములోంచి సామాన్లతో బయటికొస్తుంటే ఆ పక్షుల గుంపులు లోపలికొచ్చి గదంతా కలతిరిగి మమ్మల్ని సాగనంపుతుంటే మనసంతా అదోలాగయిపోయింది. చాన్నాళ్ళనించుండటంవల్ల ఆ హోటల్లో వాళ్ళకి మా పేర్లన్నీ తెలిసిపోయాయి. అంతా వచ్చి సెండాఫ్ చెపుతుంటే మనిషికి వంద (వాళ్ళ కరెన్సీ) చొప్పున ఇచ్చుకుంటా వచ్చేడు తనికెళ్ళ భరణిగారు. హోటలు దాటి కుడిపక్కకి తిరిగిందీ కారు.
ఎడం పక్కషాపులు. కుడిపక్క షాపులు, ఎడం పక్క కొండలు. కింద ప్రవాహం, బోట్లు. దాన్ని జేర్చి వందల ఎకరాల్లో పార్కు. అలా చాలా దూరం జర్నీ తర్వాత ఎయిర్ పోర్ట్ వచ్చింది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ లాగా చాలా చిన్న ఎయిర్‌పోర్టది. లోపల అందంగా పూలు పూచిన పెద్ద చెట్టు కనిపించింది. దాని పేరు అడిగితే ఎవరూ చెప్పలేక పోయారు.అప్పుడే వచ్చాగిన గునా ఎయిర్ లైన్స్ విమానం ఇలా ఎక్కామో లేదో ఇరవై నిమిషాల్లో ఖాట్మండ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లో దింపేసింది. అక్కడినుంచి పక్కనే వున్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి లగేజీతోపాటు వచ్చి ఇమ్మిగ్రేషన్ పూర్తిచేసుకున్నాం.
ఇంకా చాలా టైముంది. ఢిల్లీ వెళ్ళే జెట్ రెండూ నలభై (వాళ్ళ టైముకి) నిమిషాలకి చెకిన్ అయ్యి థర్డ్ ఫ్లోర్‌లో వున్న స్టార్ రెస్టారెంట్లో భోజనం చేసి కిందికి దిగాం. బయల్దేరిన జెట్ వైట్ బోయింగ్ హాయిగానే ఢిల్లీ చేర్చిందిగానీ అక్కడ్నించి మొదలయ్యినియ్యి మా పాట్లు. డొమెస్టిక్ ఫైట్‌లో అయితే ఖాట్మండ్‌లో వేసిన లగేజీ హైదరాబాదులో తీసుకోవచ్చు. కానీ, ఈ అమ్మిరాజు ఇంటర్నేషనల్ ఫైట్‌లో సామానేసేసరికి వాటన్నిటిని ఢిల్లీలో తీసుకుని తిరిగి మళ్ళీ హైదరాబాదెళ్ళే డొమెస్టిక్‌లో వేయడానికి చాలా అవస్థలు పడుతున్న భరణిని చూస్తుంటే ఈ వెధవ విమానాల్లో వెళ్ళేకంటే ఎడ్లబండి బెటరనిపించింది.
ఆరుగంటల పది నిమిషాలకి హైదరాబాద్ బోయింగెక్కిన అరగంటక్కానీ మామూలు మనుషులమవ్వలేదు. ఇంతలో బెంగళూరులో ఉజ్జోగం చేస్తున్న బెజవాడతను మొన్నే పెళ్ళి చేసుకుని భార్యతో హనీమూన్ కెళ్తా ఖాళీగా వున్నప్పుడు చదూకోడానికి కూడా తెచ్చుకున్న శ్రీశ్రీగారి ఖడ్గసృష్టి విప్పేడు. తర్వాత భరణి ఈ మధ్య తీసిన సిరా, లాస్ట్ ఫార్మర్, కీ సినిమాల గరించి మాటాడుతుంటే, “సిన్మా జనం మనసులోకెళ్తేనే గదా మనం ఆలోచించగలుగుతాం,” అన్నాను. “మీకు నచ్చిన మంచి ఇండియన్ సినిమాలు రెండు మూడు చెప్పండి,” అన్నాడు.
“సత్యజిత్ రే పథేర్ పాంచాలి, చారులత, జల్సాఘర్, రిత్విక్ ఘటక్ తీసిన మేఘగా డాకే అన్జెప్పి ఇంకా చాలా మాటాడుకున్నాం. చదవడానికేవన్నా పుస్తకం ఇమ్మంటే గోటేటి లలితాశేఖర్ రాసిన ‘మూడో అందం’ ఇచ్చి, నేను శేషగిరిరావుగారి ప్రిన్సెస్ హెమింగ్‌వే చదవడం మొదలెట్టాను. ఢిల్లీ ఫైట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ పోర్ట్‌లో ఆగుతున్నప్పుడు 28 సెల్సియస్ డిగ్రీ అంటా ఎయిర్ హోస్టెస్ వాతావరణం వివరాలు చెప్పాక ఫ్లైటాగింది. తుంపర గాలి.
ఏరోబ్రిడ్జి మీంచి కిందికి దిగి ఏరో బెల్డ్ మీంచొచ్చిన సామాన్లు తీసుకుని బయటికొచ్చాక సామాన్లు స్కార్పియోలో సర్దాకా వైవిఎస్ చౌదరిగారి షూటింగపుడు అమెరికా మీరూ వచ్చేద్దురుగాని సెకెండా అద్భుతంగా రాసేసుకుందాం అంటా నన్ను మా ఇంటి దగ్గర దింపే సెళ్ళిపోయేడు.

స్నానం చేసి బట్టలు మార్చుకుని నేపాల్లో కొన్నవి మా ఇంట్లో వాళ్ళకి పంచి పెడ్తుంటే ఫోను. ‘నేను భరణిని’ అన్నాడవతల్నుంచి. ఏంటి స్వామీ చెప్పమన్నాను. 

“చాలా దారుణం జరిగిపోయిందండీ” అన్నాడు. 
“అయ్యో ఎవరన్నా పోయేరా?” 
“ఛఛ… ఈ టైములో కామెడీ ఏంటండీ… పోక్రాలో ఆ బరాహీ హోటల్లో మనం దిగేం గదా?” 
“అవును దిగేం.’’
“నా రూమ్ నెంబర్ 601 గదా?” 
“ఔనదే.”
“ఆ రూమ్‌లో మనం రాసుకున్న మన ఫస్టాఫ్ కథ ఫైలు అక్కడే మర్చిపోయొచ్చేనండీ” అన్నాడు భరణి.
“దానికింత బాధేందుకు. ఆ హోటల్ మేనేజర్ రీతూశర్మ మనకి బాగా ఫ్రెండయ్యేడు గదా, అతనికి ఫోన్ చేద్దాం” అన్నాను. 
“ఆల్రెడీ నేను చేసేనండీ. సెలవు పెట్టి హిమాలయాల బోర్డర్లో వున్నవాళ్ళత్తారింటికెళ్ళే డంటాడు” అన్నాడు. 
‘‘వాడొచ్చేకా తీసుకుందాం” అన్నాను. 
“ఎప్పుడొస్తాడో తెలీదంట. వాడు చాలా బ్రిలియంటేగానీ మెంటలోడంట.’’
“పోన్లే భరణీగారూ… ఈ సిన్మా సూపర్ హిట్టు.’’ 
“నేనలా మాటాడ్తుంటే మీరలా మాట్లాడారేంటీ?”
‘‘చాలా ఏళ్ళ క్రితం అరకు ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో నేను రాసుకున్న స్క్రిప్టు ఫైలు అక్కడే మర్చిపోయి వచ్చాను. దాని ఎంక్వైరీ చేస్తే ఇన్‌ఛార్జి పాడేరు ట్రాన్స్‌ఫరై వెళ్ళిపోయేడని తెలిసింది.
‘‘అరకు గెస్ట్‌హౌస్‌లో ఎంక్వయిరీ చేయిస్తే ఎంతకీ దొరకలేదా మనిషి. చచ్చినట్టు మళ్ళీ రాసు కున్నాను. ఆ సిన్మా సూపర్ హిట్టు. దాన్లాగే ఇదీ పెద్ద హిట్టవుద్దిలే. మళ్ళీ రాసుకుందాం” అన్నాను.
“మరప్పుడు స్క్రిప్ట్ మర్చిపోయిన ఆ సిన్మా పేరేంటీ?” అన్నాడు భరణి.
“అన్వేషణ” 

నోట్: ఈ యాత్ర కొన్నేళ్ళక్రితం నేపాల్లో భూకంపం రాకముందు చేసింది.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

హీరో కళ్యాణ్ రామ్ 118 మూవీ కొత్త పోస్టర్

Sat Feb 9 , 2019
హీరో కళ్యాణ్ రామ్ 118 మూవీ కొత్త పోస్టర్ https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: