తెలుగు సినిమా దర్శక దిగ్గజాలు పార్ట్ -1 కె.వి.రెడ్డి

తెలుగు సినిమా దర్శక దిగ్గజాలు పార్ట్ -1 కె.వి.రెడ్డి

తెలుగు సినిమా పుట్టింది 1931లో భక్త ప్రహల్లాద అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడి నుంచి తెలుగు సినిమాలో ఎంతో మంది గొప్ప దర్శకులు నటులు నిర్మాతలు సంగీత దర్శకులు సాంకేతిక నిపుణులు ఇలా ఎందరెందరో మహానుభావులు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఏ సినిమాకి అయినా దర్శకుడే మూలస్తంభం. 87 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న తెలుగు సినిమా ఇన్ని సంవత్సరాలలో మనకు ఎంతో మంది గొప్ప దర్శకులని అందించింది. అలాంటి గొప్ప దర్శకుల గురించి మనం తెలుసుకోవడం మన బాధ్యత. ముందుగా ఈ రోజు దర్శకుడు కె.వి.రెడ్డి గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం.
కె.వి.రెడ్డి అనగానే ఏసి నీ ప్రేమికుడు కైనా ముందుగా గుర్తొచ్చే సినిమా పేరు మాయాబజార్. ఆ సినిమాతో ఆయన చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. 1957 మార్చి 27న రిలీజ్ అయిన ఆ సినిమా తెలుగు సినిమాల్లో అన్నిటికంటే గొప్ప  క్లాసిక్ గా ఇప్పటికీ చెప్పుకుంటారు. 

బాల్యం, సినిమా మీద ఇష్టం:

కెవి రెడ్డి గారి అసలు పేరు కదిరి వెంకటరెడ్డి. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర్లో ఉన్న తెళ్ళమిట్టపల్లే లో 1912వ సంవత్సరంలో జూలై 1వ తేదీన జన్మించారు. కొండారెడ్డి, వెంకట రంగమ్మ వారి తల్లిదండ్రులు. ఆయన చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండే వాడట. తన చిన్నతనం నుంచే సినిమాల మీద బాగా ఇష్టం పెంచుకున్న ఆయన తన స్నేహితుడు మూలా నారాయణస్వామి సహాయంతో 1938 లో గృహలక్ష్మి అనే సినిమాకు క్యాషియర్ గా పని చేశారు. ఆ తరువాత వాహినీ సంస్థ వారు నిర్మించిన వందేమాతరం అనే సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు ఆ సినిమాకు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వం వహించారు. అక్కడే ఆయనకు పౌరాణిక బ్రహ్మ అని అనిపించుకున్న ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పరిచయమయ్యారు ఇద్దరు కలిసి వందేమాతరం సినిమాకి సహాయ దర్శకులుగా పని చేశారు. కె.వి.రెడ్డి గారు వాహినీ సంస్థ లోనే సుమంగళి, దేవత స్వర్గసీమ,  లాంటి సినిమాలకి క్యాషియర్, మేనేజర్ గా పని చేస్తూ వచ్చారు.తాను ప్రొడక్షన్ మేనేజర్ గా క్యాషియర్ గా పనిచేస్తున్నా కూడా కె.వి.రెడ్డి గారి మనసు ఎప్పుడు రచన-దర్శకత్వం మీదే ఉండేది.

దర్శకత్వ ప్రస్థానం:

1942లో ఎట్టకేలకు ఆయన కల ఫలించి భక్త పోతన అనే సినిమా కు దర్శకత్వం వహించారు. ఆ సినిమా పెద్ద హిట్ అవడం వల్ల కెవి రెడ్డి గారి కి మంచి పేరు వచ్చింది. మళ్ళీ 1947లో యోగి వేమన అనే సినిమా చేశారు అది ఆర్థికంగా ఆడకపోయినా కానీ  ప్రపంచ వ్యాప్తంగా గొప్ప క్లాసిక్ సినిమా అన్న పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇక 1951 లో విడుదలైన పాతాళ భైరవి సినిమా తెలుగు సినిమా నే మార్చేసింది కెవి రెడ్డి గారికి గొప్ప పేరును సంపాదించి పెట్టింది. చందమామ కథల పుస్తకం లో ఉన్న ఒక చిన్న కథ నుంచి లైను తీసుకొని పాతాళభైరవి సినిమా కథని చేశారు.

ఈ సినిమాలోని మాటలు సాహసం చేయరా డింభకా రాకుమారి లభించునురా అన్న మాటలు, కలవరమాయే నా మదిలో ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు లాంటి పాటలు ఆంధ్ర దేశమంతటా బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత నుంచి కె.వి.రెడ్డి గారు ఇక వెనుదిరిగి చూసుకోలేదు పెద్ద మనుషులు, దొంగరాముడు, మాయాబజార్ పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరునికథ, శ్రీకృష్ణార్జునయుద్ధం సత్యహరిచంద్ర ఉమా చండీ గౌరీ శంకరుల కథ భాగ్యచక్రం , శ్రీకృష్ణసత్య ఇలా ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. పాతాళభైరవి, మాయాబజార్ సినిమాలని వాహినీ సంస్థ తమిళ్ లో రీమేక్ చేస్తే వాటికి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం గారే వహించారు. గుణసుందరి కథ, దొంగరాముడు సినిమాలకి కె.వి.రెడ్డి గారు స్క్రీన్ ప్లే అందించారు. అలాగే దొంగరాముడు, మాయాబజార్ ఈ రెండు సినిమాలకి స్వయంగా ఆయనే కథ రాశారు. 

కెవిరెడ్డి దర్శకత్వ శైలి:

కెవి రెడ్డి గారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కథాబలం ఉన్నవే.  కథ ఎత్తుగడ ఎలా ఉండాలి దాన్ని ఎలా నడపాలి దాని ముగింపు ఎంత అర్థవంతంగా ఉండాలి అన్నది కె.వి.రెడ్డిగారి సినిమాల్ని గమనిస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఆయన తీసే ఏ సినిమాని అయినా ఒక యజ్ఞంలా భావించేవారు అకుంఠిత దీక్ష సృజనాత్మక పరిశీలన పట్టుదల క్రమశిక్షణతో చేసేవారు. సమాజానికి ఉత్తమ సంస్కార విలువలు ఉన్న సినిమాలను అందించడమే ఆయన విజయానికి ప్రధాన కారణం. దొంగ రాముడు లాంటి సినిమా స్క్రీన్ ప్లేని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠంగా చేర్చారు అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో మల్టిపుల్ క్లైమాక్స్ లను మనం ప్రప్రథమంగా దొంగరాముడు సినిమాలోనే చూస్తాం. పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి సినిమాలలో ఆకాలం లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ ను తీసుకు వచ్చిన ఆయన విజన్, సృజనాత్మకతచాలా గొప్పవి. సినిమాకు సంబంధించినంత వరకు ఆయన ప్రతి షాట్ ముందుగానే కంపోజ్ చేసుకునేవాడు. సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్  ముందుగా తమ డైలాగుల్ని కచ్చితంగా కంఠస్థం చేయవలసిందే. విలన్ దగ్గర్నుంచి కామెడీ ఆర్టిస్ట్స్ ల వరకు సినిమాలో తమకు ఉన్న ప్రతి డైలాగును కె.వి.రెడ్డి గారు ముందు ఒకసారి రిహార్సల్స్ చేసి చూపవలసిందే. 

దర్శకత్వం కొన్ని చాలెంజ్ లు:

కెవిరెడ్డి గారు తన దర్శకత్వ ప్రస్థానంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఆయన సినిమాలు తీస్తున్నప్పుడు ఆయన నిర్ణయానికి సంబంధించి చాలామంది ఆయన తో  విభేదించే వారు. గుణసుందరి కథ’ లో ‘శ్రీరంజని హీరోయినా?’ అన్నారు. పాతాళభైరవిలో “రామారావు పక్కన మాలతి ఏం బావుంటుంది?” అన్నారు  మాయాబజార్‌లో అంత లావు సావిత్రి శశిరేఖా? ‘రేవతి ఛాయాదేవా?’ అన్నవాళ్లకి “అందుకే ఛాయాదేవి!” అని ఆయన సమాధానం ఇచ్చారు. అంతలావు తల్లి ఉన్నప్పుడు పక్కన కూతురిలో ఆ లావు కనిపించదని కె.వి. నమ్మకం. శ్రీరంజని అయినా, మాలతి అయినా కథాపరమైన పాత్రలకి ఏ సమస్యా రాదన్నది ఆయన విశ్వాసం. బక్కచిక్కిన ‘పోతన’ పాత్రకి భారీమనిషి నాగయ్యేమిటి? అని విమర్శ వచ్చినా  నాగయ్య తన నటనతో, తన పర్సనాలిటీని మరపింపజేస్తాడని కె.వి. గారి బలమైన నమ్మకం. ఒక్క కథాగమనం, షూటింగ్‌ అనే కాకుండా అన్నీ నిశితంగా ఆలోచించే నిర్ణయించేవాడు ప్రధాన పాత్రల పక్కన చిన్న వేషాలు, పక్కవేషాలు, చెలికత్తెల వేషాల నిర్ణయంలో కూడా ఆయన ఆలోచన గొప్పగా ఉండేది. కె.వి. రెడ్డిని చూసినప్పుడు ‘ఈయన సినిమా డైరెక్టర్‌లా లేరే!’ అనుకునేవారు కొత్తవాళ్లు. ముతక ఖాదీపంచె, పొట్టిచేతుల చొక్కా, పర్సు, కాయితాలూ, పెన్నులతో ఎత్తయిన జేబు, భుజం మీద వేల్లాడుతూ కండువా ఉండేది. కెవి రెడ్డి గారు అందర్నీ ‘బ్రదర్‌!’ అని సంబోధిస్తూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేవారు.

షూటింగ్ స్టైల్:

షూటింగ్ చేసేప్పుడు కె.వి. రెడ్డి గారి విధానమే వేరు. ఆయన తానుగా చేసి చూపించడమో, నటించడమో చేసి చూపించేవాడు కాదు చెప్పేవాడు కూడా కాదు. పాత్రధారుల్నే చెయ్యమనేవాడు. అది తనకి కావలసిన రీతిలో లేకపోతే, ఇంకోలా, ఇంకోవిధంగా చెయ్యమనీ చివరికి తనకి నచ్చిన దానిని ఖాయం చేసేవాడు. ఎక్కువ తక్కువలుంటే చెప్పేవాడు. ఆయన సినిమా షూటింగ్ లలో కళాకారులకి స్వతంత్రం వుండేది దర్శకుని నియంత్రణా ఉండేది. ఏదైనా షాటులో ఆరుగురు నటులుండి డైలాగులు చెప్పేది ఒక్కరే అయినా రిహార్సల్సు అందరి చేత చేయించేవారు. ఒకొక్క రిహార్సలులోనూ ప్రతి ఒక్కరి రియాక్షనూ చూసేవారు. ఐతే ఆయన ఏనాడూ ‘షాట్ ఒకే లేక టేక్ ఓకే’ అని ఆయన అనలేదు. ‘పాస్‌!’ అని అనడమే ఆయన అలవాటు. షూటింగ్ చేసేప్పుడు పూర్తి నిశ్శబ్దం, క్రమశిక్షణ, ఏకాగ్రత కనిపించేవి కెవి రెడ్డి గారి సినిమా సెట్లో.

ముగింపు:

ఎన్నో గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించి ఎంత మంది గొప్ప నటులు నటీమణులు సంగీత దర్శకులను తెలుగు సినిమాకు పరిచయం చేసిన కదిరి వెంకట రెడ్డి గారు తెలుగు సినిమాకు చేసిన విశేష సేవలు ఎనలేనివి. తెలుగు సినిమాకు స్వర్ణయుగం అనదగ్గ 1940 నుంచి 70వ దశకం వరకు తన సినిమాలతో తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహా దర్శకుడు కె.వి.రెడ్డి గారు 1972 సెప్టెంబర్ 16 వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు మరణించారు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేనిది ఒక్క కళాకారునికి మాత్రమే ఉన్న ఒక గొప్ప అవకాశం మరణం తర్వాత కూడా బతికి ఉండటం. తాను తీసిన సినిమాలో తాను నటించిన సినిమాలో తన మననం మరణానంతరం కూడా ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట జనాలకు వినోదాన్ని అందిస్తూ నే ఉంటాయి. మళ్లీ మరొక్కసారి పాతాళభైరవి నో మాయాబజార్ నో లేక దొంగ రాముడు సినిమా నో చూడటం ద్వారానే మనం ఆ మహనీయుడుకి నివాళి అర్పించగలం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Happy Birthday Deepika/Deepveer

Sat Jan 5 , 2019
Happy Birthday Deepika / Deepveer https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: