పడి పడి లేచే మనసు సినిమా విశ్లేషణ

పడి పడి లేచే మనసు సినిమా విశ్లేషణ

పడి పడి లేచే మనసు మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు దాదాపుగా అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభించింది.సినిమా ఫస్టాఫ్ చాలా వరకు బావున్న సెకండాఫ్ అంతా గందరగోళంగా తయారైంది అని ఫిర్యాదులు వినిపించాయి.అయితే ఏ సినిమా అయినా హిట్ కావాలంటే దానికి ముఖ్యంగా కావలసింది మంచి కథ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం తెలుగులో కానీ, తమిళ, కన్నడ, హిందీ  ఏ భాషలో అయినా సరే కథలో మంచి విషయం ఉన్నప్పుడు కచ్చితంగా అది చిన్న సినిమా అయినా జనాల నుంచి మంచి స్పందన లభిస్తుంది ఆ సినిమాలు ఆడుతున్నాయి.
ఏ సినిమా తీసుకున్న ఆ సినిమాలో ఉన్న కథ మూడు భాగాలుగా ఉంటుంది. వాటినే మనం ప్రారంభం, మధ్యమం, ముగింపు అంటాం. ప్రపంచ సినిమా చరిత్రలో ఎంత పెద్ద దర్శకులను తీసుకున్నా కూడా వారు తీసిన ప్రతి సినిమా కథలో మనం వీటిని చూడవచ్చు. ఏ సినిమాను తీసుకున్నా కూడా దానిలో కథ చెప్పే విధానం ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ లో ఉంటుంది. హాలీవుడ్ స్క్రీన్ ప్లే రచయిత సిడ్ ఫీల్డ్ చెప్పినట్టుగా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో చాలా మట్టుకు సినిమాలు మనకు వస్తుంటాయి. అయితే ఏ సినిమా అయినా ఇలాంటి ఒక ఫార్మాట్ లో లేకుండా అతుకులబొంతలా ఉంటే కచ్చితంగా ఆ సినిమా పరాజయం పాలవుతుంది. అసలు సినిమా కథ ఏంటి ఆ సినిమాలో ఉన్న కథా నాయకుడి లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం అతను ఎందుకు సాధించాలి అనుకుంటున్నాడు దానికి అతనికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చివరికి ఆ లక్ష్యం కోసం అతను ఏవిధంగా పోరాడి గెలిచాడు అన్నది ఏ సినిమా కథలో అయినా ఉండేదే. అయితే మన తెలుగు సినిమాల్లో చాలా మట్టుకు మన దర్శకులు సినిమా మొదటి భాగం పూర్తి అయ్యేంత వరకు ఒక పట్టాన కథలోకి రావడానికి ఇష్టపడరు. దాదాపుగా అన్ని సినిమాల కథలు సెకండాఫ్ లోనే స్టార్ట్ అవుతాయి. మన వాళ్ళ అభిరుచి మన వాళ్ళ ఎంపిక  ఇలానే ఉంటుంది అని సరిపెట్టుకుందాం అనుకున్నా కూడా పడి పడి లేచే మనసు సినిమా దగ్గరికి వస్తే ఖచ్చితంగా కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా మరీ దారుణంగా ఈ సినిమా స్టోరీ పరిస్థితి తయారైంది.
ముందుగా మనం పడి పడి లేచే మనసు సినిమాలో ఉన్న ప్రధాన కథను గమనిస్తే సూర్య, వైశాలి అనే ఇద్దరు ప్రేమికుల కథ ఇది. ఈతరం అమ్మాయి వైశాలి కోసం తను ఉంటున్న ఏరియాలో ఉన్న చాలా మంది యువకులు ట్రై చేస్తుంటారు అయితే సూర్య ఒకానొక సమయంలో వైశాలిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ అతని మిత్రులు వైశాలి గురించి చెప్పడంతో తానే ఒక నాటకమాడి తద్వారా వైశాలి ప్రేమని గెలుచుకుంటాడు. ఆ తర్వాత అనుకోకుండా ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణలో సూర్య తనకు పెళ్లంటే ఇష్టం లేదని మనం పెళ్లి చేసుకోవడం జరగదని చెప్పడంతో వైశాలి షాక్ అవుతుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది చివరికి ఒక సంవత్సరం పాటు దూరంగా ఉండి ఆ తర్వాత కూడా ఇద్దరికీ ఒకరిని విడిచి ఒకరు బతకలేమని అనిపిస్తే అప్పుడు వచ్చి మళ్లీ కలిసి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతారు. సంవత్సరం తర్వాత సూర్య తన తప్పు తెలుసుకుని వైశాలి కోసం వస్తాడు వైశాలి కూడా వస్తుంది కానీ వైశాలి అక్కడికి వచ్చినట్టుగా సూర్యకు తెలియదు సూర్యని మాత్రం వైశాలి చూస్తుంది అయితే అదే సమయంలో అక్కడ అనుకోకుండా వచ్చిన భూకంపం వల్ల జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. తను జ్ఞాపకశక్తి కోల్పోయే విధానం కూడా చాలా క్రిటికల్ గా ఉంటుంది తన జీవితంలో ఉన్న జ్ఞాపకాలన్నిటిని కొద్దికొద్దిగా ప్రతి రోజు మరిచి పోతుంది. ఈ విషయం సూర్య కు తెలిస్తే సూర్య బాధపడతాడని సూర్యకు దూరంగా ఉండాలని తన స్నేహితురాలితో వైశాలి సూర్యని మర్చిపోయింది అనే విషయాన్ని చెప్పిస్తుంది. ఇది విని సూర్య మొదట బాధపడ్డా మళ్లీ వైశాలిని ప్రేమలో పడేస్తానని కొత్తగా తన పాత ప్రేమకథ మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది వైశాలి నిజంగానే తన గతం మర్చి పోయిందా సూర్య, వైశాలి ఒక్కటయ్యారా అనేది మిగతా కథ. ఇప్పుడు మీకు ఈ సినిమా కథ పూర్తిగా అర్థమైంది కదా కానీ అదే మనం సినిమా చూసినప్పుడు మాత్రం మనకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎందుకో తెలుసా దర్శకుడు ఈ కథని సూటిగా చెప్పకుండా పాత్రల మధ్య, ప్రేక్షకులలో అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్లనే.
సూర్య అనే కుర్రాడు వైశాలి అనే అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళిద్దరి ప్రేమకథలో ఏం జరిగింది సింపుల్గా చెప్పాలంటే ఇదే ఈ సినిమా కథ. అయితే ఈ కథలో రెండు పాత్రల మధ్య సంఘర్షణ కోసం రెండు పాత్రల మధ్య బ్రేకప్ కోసం దర్శకుడు ఎంచుకున్న విధానమే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడానికి ప్రధాన కారణం అయింది. అందువల్లే మనం సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో చూసిన సీన్ లే మళ్ళీ సెకండాఫ్ లో కూడా చూడటం జరుగుతుంది. తను ఒకసారి ప్రేమలో పడేసిన అమ్మాయిని మళ్లీ ప్రేమలో పడేసి రావడం అన్నది చాలా కొత్త పాయింట్ గా ఎగ్జైటింగ్గా దర్శకుడు ఫీల్ అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తను మొదటిసారి అమ్మాయిని ప్రేమలో పడేసినప్పుడు ఇరు పాత్రల మధ్య పరిచయం జరిగి ఇద్దరూ ప్రేమలో పడతారు కానీ అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు ఆ పాత్రల మధ్య ఇంకా ఏం జరిగింది ఇద్దరి జీవితాలు ఎలా మారాయి అన్నది కొత్తగా బలంగా ఉండాలి. ఈ విషయంలోనే దర్శకుడు చాలా పెద్ద తప్పు చేశాడు దాంతో ఈ సినిమా కథ బిగినింగ్ మిడిల్ ఎండ్ లా కాకుండా ఒక సర్కిల్ లా అక్కడే తిరుగుతూ ఆగిపోయింది.
ఎప్పుడైతే తనకు జరిగిన ప్రమాదం వల్ల వైశాలి తన జ్ఞాపక శక్తిని కోల్పోయే విధానం మొదలవుతుందో ఆ క్షణం నుంచి కథలో ఉన్న రెండు పాత్రలు ప్యాసివ్ పాత్రలుగా మిగిలిపోయాయి. కథలో ఇద్దరు ప్రేమికుల మధ్య  సమస్య వస్తే దాన్ని పరిష్కారం కోసం ఆలోచించకుండా ఎప్పుడైతే దీనిని విషాదాంతం చేయాలనుకున్నాడో అప్పుడే ఆ కథా రచయిత పూర్తిగా ట్రాక్ తప్పాడు అని అర్థం. ఇండిపెండెంట్ గర్ల్ అయిన వైశాలి తనకు వచ్చిన సమస్య మీద పోరాటం చేయకుండా తన ప్రేమను అంత ఈజీగా వదిలేయాలని ఎందుకు అనుకుంటుంది. తను లేకపోతే సూర్య బతకలేనని తెలిసినపుడు తన సమస్యని సూర్యకి చెప్పి అతని సహాయంతో ఈ సమస్య మీద ఏమన్నా పోరాటం చేసి ఉంటే కథ మరో విధంగా ఉండేది. అప్పుడు వైశాలి సూర్యతో రోజు తనని మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేయమని అడగడం సూర్య ఆ పని చేయడం ఇలా కథలో కొత్తదనంతో పాటు పాత్రలు కూడా చాలా యాక్టివ్ గా  ఉండేవి. 
మనం సినిమా ఫస్టాఫ్ ను తీసుకుంటే సూర్యకు వైశాలిని ప్రేమలో పడేయాలి అని ఒక గోల్ అంటూ ఉంది.ఇంటర్వెల్ కు ముందు సూర్య గోల్ నెరవేరింది వైశాలి గోల్డ్ డాక్టర్ చదవడం కాబట్టి వైశాలి డాక్టర్ చదువుతుంది అదేవిధంగా ప్రేమలో కూడా పడిపోయింది. ఆ తరువాత ఇద్దరికీ మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల ఎప్పుడైతే దూరం పెరిగిందో ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ తిరిగి కలుసుకోవాలని ఆరాటపడ్డారో అది ఇద్దరి కామన్ గోల్ అయింది. కానీ సినిమాలో సెకండాఫ్ అంతా జరిగిందేంటి స్వతహాగా డాక్టర్ అయ్యుండి తనకొచ్చిన సమస్య మీద పోరాడకుండా నిస్సహాయంగా ఉండే పాత్ర వైశాలిది అయితే అసలు తను ప్రేమించిన అమ్మాయికి ఏం జరిగిందో తెలియని పాత్ర సూర్యది.
Image showing about three act structure
మన నిజ జీవితంలో అయినా సరే మనకు కావాల్సిన వాళ్ళకి ఏమైందో తెలుస్తే వాళ్ళ సమస్య పరిష్కారం కోసం మన వంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తాం చివరికి మంచే చెడో జరుగుతుంది కానీ అసలు వాళ్ళ సమస్య ఏమిటో తెలియకుండా మనమేం చేయగలం. సినిమాలో ఇదే జరిగింది వైశాలి సమస్య తెలియనప్పుడు సూర్య ఏమీ చేయలేడు తను గతం మరచి పోయింది అని తెలిసినప్పుడు తనను మళ్లీ ప్రేమలో పడేస్తానని బయలుదేరిన సూర్య కూడా ఆ తర్వాత వైశాలి ఏం చేస్తుందో ఏమి చెబుతుందో అర్థం కాక ఒక ప్యాస్సివ్ పాత్రగా మిగిలిపోయాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో అసలు వైశాలి చెప్తుంది నిజమా అబద్దమా అది నిజమైతే సూర్య ఏం చేయాలి అబద్ధమైతే సూర్య ఏం చేయాలి అసలు వాళ్ళిద్దరూ కలవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. సినిమా క్లైమాక్స్ ను కూడా చాలా అర్ధాంతరంగా అర్థం లేకుండా హడావుడిగా ముగించారు. తనకున్న సమస్యను సూర్యకి చెప్పాలా వద్దా అన్న మీమాంస వైశాలిది, అసలు వైశాలి సమస్య ఏంటో తను ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి సూర్యది ఇలా పాత్రలకు ఒక స్పష్టమైన లక్ష్యం లేనప్పుడు ఆ కథ కచ్చితంగా రక్తి కట్టదు ఈ సినిమా విషయంలో జరిగింది అదే.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రోమా సినిమా విశ్లేషణ

Sun Dec 23 , 2018
రోమా సినిమా విశ్లేషణ ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు వచ్చిన ఆస్కార్ అవార్డ్ ల్లో బెస్ట్ సినిమా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ అక్ట్రెస్ ఇంకా చాలా విభాగాల్లో పోటీ పడుతున్న ఈ సినిమా గురించి పూర్తి విశ్లేషణ మీకోసం. https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: