“మా” లో మళ్ళీ రగడ


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలంటేనే చాలా హడావిడి వుంటుంది. ఎందుకంటే టాలీవుడ్ లో రెండు గ్రూపులు ఉన్నాయని, ఏ గ్రూపులో ఎవరు ఉన్నారనే విషయం ఈ ఎన్నికల ద్వారానే సామాన్య మానవులకు, దిగువ శ్రేణి సినీకార్మికులకు ఇలా అందరికీ తెలుస్తుంది. ఇదివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా రాజేంద్రప్రసాద్, హేమ మధ్య ఎన్ని గొడవలు జరిగాయి అనేది అంద రూ చూశారు అలాంటి ఎన్నికలు ఈసారి కూడా రాబోతున్నాయి.

ఈసారి తను మా అధ్యక్షుడిగా పోటీచేస్తానని ప్రకటించారు నటుడు నరేష్. తమ ప్యానెల్ లో తను అధ్యక్షుడిగా, రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తారని ప్రకటించాడు. ఏకగ్రీవంగా జరగాల్సిన ఈ ఎన్నిక, ఇలా పోలింగ్ వరకు ఎందుకొచ్చిందో రావాల్సి వచ్చిందో కూడా వెల్లడించాడు నరేష్. ఒక టర్మ్ అంటే ఒకసారికి ఒకరు మాత్రమే అధ్యక్షుడిగా ఉండాలని అసోసియేషన్ లో ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామన్న నరేష్.. అందుకు తగ్గట్టుగానే అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ తప్పుకున్న తర్వాత శివాజీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా శివాజీరాజా మరోసారి అధ్యక్షుడిగా ఉంటానని అనడం అసలు బాగాలేదని, అందుకే తను నామినేషన్ వేయాల్సి వచ్చింది అని తెలిపాడు నరేష్.

నిజానికి మా అసోసియేషన్ లో శివాజీరాజా, నరేష్ మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. అమెరికాలో జరగాల్సిన ఓ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని నరేష్ ఆరోపిస్తే, శివాజీ రాజా మరో ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించారు. ఇలా ఇద్దరిమధ్య తీవ్రస్థాయిలో జరిగిన గొడవ పరిశ్రమలో కొందరు పెద్దల వరకు కూడా వెళ్లింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అమెరికా పర్యటన రద్దవ్వడానికి కారణం కూడా ఈ వివాదమే. అప్పట్లో ఆ మేటరు ను “పెద్దమనుషులు” చక్కబెట్టినప్పటికీ.. ఇద్దరి మధ్య గ్యాప్ మాత్రం అలానే ఉంది. దీనికి తోడు తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా శివాజీరాజా చేసిన వ్యాఖ్యలు నరేష్ ప్యానెల్ కు అగ్రహం కలిగించాయి. తను మరోసారి అధ్యక్షుడిగా ఉంటానంటూ శివాజీరాజా ఏకపక్షంగా చెప్పుకోవడం ఏం బాగాలేదంటున్న నరేష్ ఈసారి తమకు అలీ, శివబాలాజీ, రాజశేఖర్ లాంటి ప్రముఖుల అండ ఉందని చెప్పుకొచ్చారు. పైగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా లక్షల రూపాయల డొనేషన్లు ఇస్తోందని, అధ్యక్షుడిగా ఉండడానికి అన్ని విధాలా తనకు అర్హత ఉందంటున్నాడు నరేష్.

మొత్తానికి నరేష్ ప్రెస్ మీట్ తో మా అసోసియేషన్ లో మళ్ళీ అగ్గి రాజుకుంది. ఎన్నికల వేళ రెండు వర్గాలకు చెందిన సెలబ్రిటీలు మరోసారి మాటలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. తాజా పరిణామాలపై శివాజీ రాజా ఇంకా స్పందించలేదు. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే నరేష్ ప్యానెల్ వర్గం మద్దతు కోసం మెగా స్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళడం. మరి ఈ విషయంలో చిరంజీవి ఎలా స్పందిస్తారో ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

బన్నీ నుంచి ఐదు సినిమాలు

Tue Mar 5 , 2019
అల్లు అర్జున్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ టెన్ హీరోలలో ఖచ్చితంగా ఉండే హీరోలలో ఒకడు. అయితే ఎప్పుడైతే తన రెండు సినిమాలు దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అయ్యాయో అప్పటి నుంచి రేస్ లో కొంచం వెనుక పడ్డాడు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: